ప్రాచీన భారతదేశ చరిత్ర - మగధను పాలించిన రాజవంశాలు
మౌర్యసామ్రాజ్యం ఏర్పడేంత వరకు మగధను 3 రాజ వంశాలు పాలించాయి.
అవి..
హర్యాంక వంశం (544-413):
బింబిసారుడు: ఇతడితో ప్రారంభమైన మగధ సామ్రాజ్యం అశోకుడి కళింగ యుద్ధం వరకు కొనసాగింది. ఈయన అంగను జయించి తన కుమారుడైన అజాత శత్రువును రాజప్రతినిధిగా నియమించాడు.
అజాతశత్రువు: తండ్రిని హత్య చేసి సింహాసనం ఆక్రమించాడు. తీవ్ర సామ్రాజ్యవాద విధానం అవలంభించాడు. కోసలరాజైన తన మేనమామ ప్రసేజ్ తో యుద్ధంలో విజయం సాధించి, కోసల రాకుమార్తెను వివాహం చేసుకోవడంతో పాటు కాశీని తిరిగి పొందాడు. ఇతడి కాలంలో మొదటి బౌద్ధ సంగీతి నిర్వహించారు. ఇతడికి కునిక అనే బిరుదుంది.
ఉదయనుడు: ఇతడు పాటలీ గ్రామంలోని గంగ, సోన్ నది సంగమ స్థానంలో కోటను నిర్మించడం ద్వారా పాటలీపుత్ర నగర నిర్మాతగా భావిస్తారు.
శిశునాగ వంశం (413-364):
శిశునాగుడు: ఉదయనుడి తర్వాత పితృహంతకులు రాజులుగా వచ్చారు. వీరితో విసిగిన ప్రజలు కాశీలో రాజ ప్రతినిధిగా ఉన్న శిశునాగుడ్ని రాజుగా చేసినట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు రాజధానిని వైశాలికి మార్చాడు. అవంతి రాజు ప్రద్యోతను ఓడించి అవంతి రాజ్యాన్ని మగధలో కలపడం ఇతడి గొప్ప విజయం. దీంతో ఈ రాజ్యాల మధ్య వందేళ్లుగా సాగిన వైరం అంతమైంది.
కాలశోకుడు: ఇతడు రాజధానిని పాటలీ పుత్రానికి తిరిగి మార్చాడు. ఇతడి కాలంలో రెండో బౌద్ధ సంగీతి నిర్వహించారు. ఇతడ్ని సేనాపతి మహా పద్మనందుడు హత్యచేసి నందవంశం స్థాపించాడు.
నందవంశం (364-321): ఈ కాలంలో మగధను పాలించిన అత్యంత బలమైన వంశం ఇదే.
మహాపద్మనందుడు: అనేక క్షత్రియ రాజ కుటుంబాలను రూపుమాపి రెండో పరశురాముడిగా పేరొందాడు. ఖారవేలుడి హాథిగుంఫా శిలాశాసనం ప్రకారం ఇతడు కళింగను జయించి విజయ చిహ్నంగా అక్కడ్నుంచి జైన తీర్థంకరుడి విగ్రహం తెచ్చినట్లు తెలుస్తోంది. ఏకరాట్ అనే బిరుదు పొందాడు.
ధననందుడు: మహా పద్మనందుడి తర్వాత అతడి ఎనిమిది మంది కుమారులు పాలించారు. వారిలో చివరివాడు ధననందుడు. ఇతడికి 2 లక్షల పదాతిదళం, 20 వేల అశ్వికదళం, 3 వేల గజదళం, 2 వేల రథ బలం ఉండేది. అలెగ్జాండర్ సేనలు బియాస్ దాటి భారత్ పై దండెత్తక పోవడానికి వీరి బలసంపత్తి కూడా ఒక కారణం. చంద్రగుప్త మౌర్యుడు ఇతన్ని అంత మొందించి మౌర్య వంశాన్ని స్థాపించాడు.
No comments:
Post a Comment